వారంలోగా ఎమ్మెల్యే ద్వారంపూడి క్షమాపణ చెప్పాలి….,?
మత్స్యకార నేతల అల్టిమేటం….
___
___
6th sense TV:కాకినాడ, ఫిబ్రవరి 26: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారంలోగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ మత్స్యకారులు అల్టిమేటం జారీ చేశారు. మత్స్యకారులను దోపిడీదారులంటూ చేసిన వ్యాఖ్యలను ద్వారంపూడి నేటి వరకు వాటిని వెనక్కి తీసుకోకపోగా ఇంకా అహంకారంతోనే విర్రవీగుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్లో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్లో ఏపీ ఫిషర్మెన్ జేఏసీ, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కుల సంఘ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర నలుమూలలకు చెందిన మత్స్యకార నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, పుదుచ్చేరి నేత మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు)పై వ్యక్తిగతంగా మాట్లాడుతూ అనంతరం మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్నారు. అప్పటినుంచి మత్స్యకారులు పలు విధాలుగా ఆవేదనలు వ్యక్తం చేసినా ద్వారంపూడి వైఖరిలో మార్పు రాలేదన్నారు. ద్వారంపూడి వ్యాఖ్యలు చేసి పది రోజులైనా ఇప్పటివరకు మత్స్యకార జాతికి క్షమాపణ చెప్పకపోవడం పట్ల ఆయన అహంకార వైఖరి అర్థమవుతోందన్నారు. వనమాడిని వ్యక్తిగతంగా విమర్శిస్తే తాము పట్టించుకోమని మత్స్యకార జాతిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల దేశ విదేశాల్లో ఉన్న మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. మరో వారం రోజులలోగా మత్స్యకార జాతికి క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో కార్యాచరణ రూపొందిస్తామంటూ మల్లాడి చెప్పారు. ఎంఎస్ఎన్ విద్యాసంస్థలు, అంతర్వేది దేవస్థానాలు వంటివి నిలిపిన దాతలు నాయకర్, కృష్ణమలు మత్స్యకారులలో ఉన్నారన్నారు. ఇంకా రాష్ట్ర నాయకులు సైకం రాజశేఖర్, బర్రి ప్రసాద్‌లు మాట్లాడుతూ ద్వారంపూడి అహంకారానికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. ద్వారంపూడి నాలుగు నెలల క్రితం తన గొయ్యి గడ్డపారతో తవ్వుకున్నాడని ఇప్పుడు పూర్తిగా గొయ్యలోకి దిగిపోయాడని ఎద్దేవా చేశారు. ఆయన ఓట్ల ప్రచార నిమిత్తం మత్స్యకార ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు మత్స్యకారులు ఇంటి తలుపులు వేసుకొని నిరసనలు తెలపాలని సూచించారు. గతంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను కూడా అవమానపరిచిన నీచ చరిత్ర అతనికి ఉందని వారు దుయ్యబట్టారు
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బలసాలి ఇందిర, మత్స్యకార నాయకులు మల్లాడి రాజు, తుమ్మల సునీత, తుమ్మల రమేష్, కోలా ప్రసాద్ వర్మ, విశ్వనాధపల్లి సత్యనారాయణ రాజు, బొడ్డు సత్యనారాయణ, పినపోతు తాతారావు, గంటా వెంకటలక్ష్మి, మల్లాడి రాజేంద్రప్రసాద్, కర్రి చిట్టిబాబు, బడే కృష్ణ, బాలిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.