కాకినాడలో అత్యాధునిక వసతులతో ప్రారంభించిన ఈఎస్ఐ ఆసుపత్రి….
6th sense TV:కాకినాడ:
కాకినాడలో అత్యాధునిక వసతులతో ప్రారంభించిన ఈఎస్ఐ ఆసుపత్రి ఈ ప్రాంత కార్మికులు, వారి కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలు అందించనుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత తెలిపారు.
ఆదివారం సాయంత్రం భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గుజరాత్ లోని రాజ్ కోట్ నుండి వ్యర్చువల్ విధానంలో స్థానిక సాంబమూర్తినగర్ ఫ్లైఒవర్ సమీపంలో 114 కోట్ల నిధులతో నిర్మించిన 100 పడకల ఇఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకలకు కాకినాడ ఎంపి వంగా గీత, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జాయింట్ కలెక్టర్ సి.వి.ప్రవీణ్ ఆదిత్య, బిజేపి రాష్ట్ర కార్యదర్శి కె.కాశీవిశ్వనాధరాజు, జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ అతిధులుగా హాజరై ప్రధానమంత్రి ప్రసంగ ప్రత్యక్ష ప్రసారాన్న్ తిలకించారు.
ఈ సందర్భంగా ఎంపి వంగా గీత ప్రసంగిస్తూ పారిశ్రామిక, సేవా రంగాలలో శరవేగంగా విస్తరిస్తున్న కాకినాడ ప్రాంతంలో కార్మికులు గతంలో వైద్య సేవల కొరకు రాజమండ్రిలోని ఇఎస్ఐ ఆసుపత్రికి వెళ్లవలసి వచ్చేదని, ఇపుడు కాకినాడలోనే రాష్ట్రంలోనే అత్యాధునిక వసతులతో 100 పడకల అసుపత్రి పారంభం కావడంతో సుమారు 60 వేల మంది కార్మికులు, వారి కుటంబాల్లోని 2 లక్షల 50 వేల మంది సభ్యులకు చేరువలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రాంత కార్మికులు, వారి కుటుంబాలకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుప్రతి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రధానమంత్రి, కార్మిక మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఎన్నో అవరోధాలు, కరోనా సంక్షోభం ఎదురైనా నాలుగు సంవత్సరాల్లోనే ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు ప్రాంతీయ కార్మిక కమీషనరేట్ ను, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. ఇఎస్ఐ ఆసుపత్రితో పాటు కాకినాడ గ్రామీణంలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం 80 పూర్తయి త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. కాకినాడ జిజిహెచ్ లో ఆర్ఎంసి పూర్వ విద్యార్ధుల ఆర్థిక సహకారంతో 30 కోట్ల నిధులతో తల్లిబిడ్డల సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని త్వరలో నిర్మించనున్నామని ఎంపి తెలిపారు. 7.5 కోట్లతో ట్రౌమాకేర్ విభాగాన్ని, మరో 7.5 కోట్ల నిధులతో కాథ్ లాబ్ సదుపాయాలను జిజిహెచ్ లో సమకూర్చడం జరిగిందన్నారు. వైద్యంతో విద్యారంగంలో 25 కోట్లు కేంద్రీయ విద్యాలయ భవనం నిర్మాణం జరుగుతోందని, ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సంస్థ దక్షిణ భారత కాంపస్ ను ఎస్ఈజడ్ లో 220 కోట్ల నిధులతో నిర్మించే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు.
కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డి మాట్లాడుతూ కాకినాడలో ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణంలో ఎంపీ వంగా గీత అలుపెరుగని కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమే ప్రాధాన్యతగా విద్య, వైద్యం, గృహనిర్మాణం రంగాలకు పెద్దపీట వేస్తోందని, ఇందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడి, కేంద్ర ప్రభుత్వం ఉదారం నిదులు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
కాకినాడ రూరల్ ఎమ్మెలే కురసాల కన్నబాబు మాట్లాడుతూ కాకినాడలో నిర్మితిమైన ఇఎస్ఐ ఆసుపత్రి ద్వారా కోస్తా ప్రాంతంలోని కార్మికులకు మెరుగైన్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. కార్మిక ఆరోగ్యం, సంక్షేమంతో కూడిన పారిశ్రామికాభివృద్దికి ఈ ఆసుపత్రి దోహదం కాగలదన్నారు. కాకినాడ లో పేరుగాంచిన రంగరాయ వైద్య కళాశాల ఉండటంతో నగరం మెడికల్ హబ్ గా అభివృద్ది చెందుతోందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి కార్మికులు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా కాకినాడలో ఆసుపత్రి ప్రారంభించడం పట్ల హర్ష వ్యక్తం చేసారు. పోర్టు కార్మికులకు ఇఎస్ఐ ఆసుపత్రి గొప్ప వరమని పేర్కొంటూ, కాకినాడ లో ఈ ఆసుపత్రి మంజూరు చేసిన గౌరవ దేశ ప్రధాని, కేంద్ర మంత్రులకు, ఇందుకు నిరంతర కృషి చేసిన ఎంపీ వంగాగీత లకు కాకినాడ జిల్లా కార్మికులకులందరి తరుపున కాకినాడ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ ఇన్యూరెన్స్ కమీషనర్ రాజేష్ కుమార్ కైమ్, కాకినాడ ఇఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.యం.రాధిక, డిడి యం.పద్మప్రియ, ఇంజనీర్లు పాల్గొన్నారు.