నాకేం తెలియదు.. లీగల్గా ముందుకెళ్తా: యాంకర్ సుమ…?
6th sense TV: తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం:
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రచారం చేసిన రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కారు. సుమక్క చెప్తేనే భూములు కొన్నామని.. తమకు న్యాయం చేయాలంటూ బుధవారం ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు.
రాజమండ్రిలో 26 లక్షలకే సొంత ఇల్లు ఇస్తామని రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రకటించడంతో చాలా మంది లక్షల్లో డబ్బులు చెల్లించారు. దీనికి సంబంధించిన ఓ యాడ్లో సుమ కూడా నటించడంతో అందరూ ఈ సంస్థను నమ్మారు. ఈ క్రమంలో ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటున్నారు.
ఈ అంశంపై సుమ స్పందించారు. 2016–2018 కాలానికి మాత్రమే రాకీ సంస్థకు సంబంధించిన యాడ్లో నటించినట్లు తెలిపారు. ఆ తర్వాత తాను నటించిన ప్రకటనలు రద్దు చేసినట్లు చెప్పారు. 2018 తర్వాత ఎటువంటి యాడ్లో నటించలేదని స్పష్టం చేశారు. ‘ఇటీవల నేను రాకీ అవెన్యూల ఆస్తుల కొనుగోలుదారుల నుంచి కొన్ని లీగల్ నోటీసులను అందుకున్నాను. ఆపై వారి నోటీసులకు సమాధానం కూడా ఇచ్చాను. నేను కూడా ఈ సమస్యను పరిష్కరించేందకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. తప్పుడు సమాచారాన్ని అరికట్టాలి’ అని సుమ అన్నారు.