వైవాహిక కేసుల్లో మహిళలను కోర్టుల చుట్టూ తిప్పకండి…
6th sense TV:సూర్యాపేట లీగల్/
వివాహ సంబంధ కేసుల్లో మహిళలను కోర్టుల చుట్టూ పదేపదే తిప్పకుండా సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఈ-సేవా కేంద్రం, కోదాడలో కోర్టు భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ప్రసంగిస్తూ కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కేసులు పెండింగ్‌లో ఉంచకుండా సామాన్యులకు సత్వర న్యాయం చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను తగ్గించేందుకు అదనపు కోర్టులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. న్యాయవాదులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని న్యాయవ్యవస్థకు వన్నె తేవాలని సూచించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.లక్ష్మణ్, జస్టిస్ పుల్లా కార్తీక్ మాట్లాడుతూ సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్య విలువలను అందించాలన్నారు. భవిష్యత్ తరాల వారు న్యాయవాద వృత్తిని స్వీకరించేలా ఆదర్శంగా నిలవాలని సూచించారు. సూర్యాపేటలో న్యాయవాదుల సమస్యలపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వినతిపత్రాలను అందజేశారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారు. అంతకుముందు జస్టిస్ అరాధే పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రిన్సిపల్ డిస్ర్టిక్ట్ జడ్జి రాజగోపాల్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సురేష్, కలెక్టర్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.