*సుడి తిరిగింది.. లక్ కలిసింది..*
*వలకు చిక్కిన అరుదైన చేపలు..*
*సిరుల పంటే..*
6th sense TV: కోనసీమ జిల్లా:సుడి తిరిగింది.. లక్ కలిసింది.. రెండు చేపలతో ఓ జాలరి లక్షాధికారిగా మారాడు. ఐదు, ఆరు నెలలు కష్టపడితే వచ్చే సొమ్ము ఒక్క రోజులోనే వచ్చింది. గంగమ్మకు బాగా మొక్కి.. వల వేసినట్టున్నాడు ఆ జాలరి. అందుకే అమ్మ కరుణించి.. సిరులు కురిపించింది.
కృష్ణా జిల్లా మత్స్యకారుడికి అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన చేపలు చిక్కాయి. ఎప్పటిలాగే గంగమ్మకి మొక్కుకొని సముద్రంలో ఒడుపుగా వల విసిరిన జాలరికి… తన వలకు ఏదో బరువైన బంగారమే చిక్కిందని అనుమానమొచ్చింది. సహచరులతో కలిసి మెల్లగా వలను ఇవతలకు లాగితే… ఆ వల్లో చిక్కుకుని ఎటూ పోలేక గిలగిలా కొట్టుకుంటున్నాయి.. బరువైన కచిడి చేపలు.. అలియాస్ గోల్డ్ ఫిష్. వలకు 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. వాటిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో శనివారం వేలం వేయగా వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఆ మత్స్యకారుడు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ కచిడి చేపను గోల్డెన్ ఫిష్ అనే పేరు కూడా ఉంది. మగ కచిడి చేప ఉదరభాగంలో ఔషధ గుణాలు ఉంటాయి. మరికొన్ని ఔషధాల తయారీలో కూడా ఈ చేప శరీరభాగాల్ని ఉపయోగిస్తారు. మరొక్కమాటలో చెప్పుకుంటే ఫార్మా ఇండస్ట్రీలో ఇదొక హాట్‌కేక్. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు.
శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ బాడీలో మిళతమవుతుంది. జీవితంలో ఒక్కసారైనా తమ వలకు ఇటువంటి చేప ఒక్కటైనా చిక్కాలని సగటు మత్య్సకారుడు దేవుడ్ని మొక్కుతాడట. ప్రస్తుతానికైతే ఈ జాక్‌పాట్ ఈ జాలరికి తగిలింది.