కోలాహలంగా..సందడిగా.. ద్వారంపూడి నామినేషన్
6th sense TV:కాకినాడజిల్లా: కాకినాడ సిటీ నియోజకవర్గ వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వెంటరాగా పండుగ వాతావరణం లో రెండు సెట్ల నామినేషన్లను సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జే వెంకటరావుకు అందజేశారు. ఆయన సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
ఆలయాల సందర్శన:
నామినేషన్ కు వెళ్లే ముందు ఎమ్మెల్యే ద్వారంపూడిని ఆశీర్వదిస్తూ ఆయన ఇంటి వద్ద పాస్టర్లు ప్రార్థనలు చేశారు. అనంతరం సతీమణి మహాలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తొలుత సాంబమూర్తి నగర్ లోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, జగన్నాధపురం దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు. మరి కొన్ని ఆలయాలను కూడా ఆయన దర్శించారు. అనంతరం ఆనందభారతి గ్రౌండ్స్ కు చేరుకున్నారు. అక్కడ హిందూ, ముస్లిం క్రైస్తవ పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ద్వారంపూడి ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయా మత పెద్దలు ఆశీర్వాదమిచ్చారు.
భారీ ర్యాలీ గా…
అశేష జనవాహినితో ఆనందభారతి గ్రౌండ్స్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మహాలక్ష్మి, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ఇతర నేతలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. దారి పొడవునా జై జగన్, జై ద్వారంపూడి నినాదాలతో రహదారులన్నీ మార్మోగిపోయాయి. నగరంలోని అన్ని డివిజన్ల నుంచి వేలాదిగా బైక్ లు, ఆటోలలో తరలివచ్చిన ప్రజలు అభిమానులతో సినిమా రోడ్డు, వైయస్సార్ ఫ్లైఓవర్ మీదుగా ఓపెన్ టాప్ వాహనంపై ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ కొనసాగించారు. పెద్ద ఎత్తున బుల్లెట్లు, మోటార్ బైకులకు జెండాలు తగిలించి సందడి చేశారు.వైయస్సార్ కాంస్య విగ్రహం వద్ద పార్టీ అభిమాని ముమ్మిడి పవన్ ఆధ్వర్యంలో భారీ క్రేన్ తో గులాబీ పూల వర్షం కురిపించారు. అక్కడే రాజీనామా చేసిన మహిళా వాలంటీర్లు గుమ్మడికాయలతో ఎమ్మెల్యే ద్వారంపూడి కి దిష్టి తీశారు.’జెండలు జత కట్టడమే… మీ అజెండా’ వంటి స్ఫూర్తిదాయకమైన పాటలకు కార్యకర్తలు డాన్సులు చేస్తూ సందడి చేశారు. అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ముందు భాగంలో ఏర్పాటు చేసిన గుర్రాలతో స్వారీ చేస్తూ మరి కొంతమంది అభిమానులు సందడి చేశారు. డాల్ఫిన్ రెస్టారెంట్ వద్ద నల్లమిల్లి మాచారెడ్డి , బదిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో క్రేన్లతో పూలు చల్లి కార్యకర్తలు అభిమానులకు మజ్జిగ వితరణ చేశారు. భానుగుడి జంక్షన్ వద్ద న్యాయవాదులు, వైశ్య ప్రముఖులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అక్కడ ఏపీఐఐసీ డైరెక్టర్ బసవ అశోక్ , వైశ్య ప్రముఖులు వేరువేరుగా గజమాలతో ద్వారంపూడి కి స్వాగతం పలికారు. కేరళ వాయిద్యాలు, డప్పులు, కోలాటం , తీన్మార్, సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ జరిగే ప్రాంతమంతా సందడి సందడిగా మారిపోయింది.
రెండు సెట్ల నామినేషన్లు:
వేలాది మంది అభిమానులు వెంటరాగా వైఎస్ఆర్సిపి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి జే.వెంకటరావుకు అందజేశారు. అలాగే ఆయన సతీమణి మహాలక్ష్మి కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో ద్వారంపూడి దంపతులతో పాటు వైశ్య ప్రముఖులు పెద్ది రత్నాజీ, సమయమంతుల కాశి, న్యాయవాది అయ్యంగారి వెంకటేష్ తదితరులు ఉన్నారు. నామినేషన్ ప్రక్రియలో వీరి వెంట ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ,, కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, సిటీ నియోజకవర్గ పరిశీలకులు అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి,వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్ పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మత్స్యకార నాయకులు కాటాడి జానకిరామ్, రాష్ట్ర వక్స్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, వివిధ డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు కన్వీనర్లు ,గృహ సారథులు నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



