కార్పొరేషన్ భవనాన్ని వేగంగా పూర్తి చేయండి:సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు…!
కాకినాడ జిల్లా: కాకినాడ:
విశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కోరారు. మంగళవారం అయిన నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు, ఇతర అధికారులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణం నందు నిర్మిస్తున్న నూతన భవన ప్రాంగణాన్ని పరిశీలించారు. పనుల ప్రగతిని కమిషనర్ వెంకటరావు ఎమ్మెల్యే వనమాడికి వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రూ.38 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు, రూ.20 కోట్ల నగరపాలక సంస్థ నిధులతో ప్రతిపాదించిన కార్పొరేషన్ భవనం మూడేళ్లు గడిచినా పూర్తి కాకపోవడం విచారకరమని, పన్నుల రూపంలో ఏటా రూ 77 కోట్లు వసూలవు తున్నప్పటికీ కార్పొరేషన్ కు సొంత భవనాన్ని రూపొందించు కోలేకపోయామన్నారు. గత ప్రభుత్వంలో ద్వారంపూడి నిర్లక్ష్యం వల్లే పనులు కుంటుపడ్డాయని, శంకుస్థాపన చేయడంలో ఉన్న దృష్టి గత ప్రభుత్వం పనులు వేగవంతంలో దృష్టి సారించలేదని వనమాడి విమర్శించారు. అవసరమైతే నగరపాలక సంస్థ నిధులు ద్వారా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును మార్చి 2025 వరకు పొడిగించారని, ఆ సమయంలోపు చాలావరకు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే వనమాడి సూచనలను కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కలెక్టర్ షాన్ మోహన్ సగిలి దృష్టికి తీసుకువెళ్లి పనులు వేగవంతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.సత్యకుమారి, కార్యదర్శి ఎం.ఏసుబాబు, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకటరావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, టిడిపి నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు.